ఏపీ నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఏటా వెయ్యి మందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఇరుపక్షాలు ఎంఓయుపై సంతకాలు చేశాయి.
By Knakam Karthik Published on 27 Feb 2025 1:30 PM IST
ఏపీ నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఏటా వెయ్యి మందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఇరుపక్షాలు ఎంఓయుపై సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... జర్మనీలో వృద్ధుల సంరక్షణ, ఆసుపత్రుల్లో 3 లక్షల మంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉందని తెలిపారు. యూరప్ లో ముఖ్యంగా జర్మనీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను రాష్ట్రంలో నర్సింగ్ విద్యనభ్యసించిన విద్యార్థినులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ వల్ల ప్రతి ఏటా వెయ్యి మంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజితో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
స్కిల్ బి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ వింజమూరి రవిచంద్ర గౌతమ్, సీఈఓ ఉజ్వల్ చౌహన్ మాట్లాడుతూ... తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 10వేల మందికిపైగా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. స్కిల్ బి అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ రిక్రూట్‌మెంట్ స్టార్టప్‌లలో ఒకటిగా ఉందని తెలిపారు. జర్మనీ, పోలాండ్, హంగేరీ, లిథువేనియా, లాట్వియా, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు తమ సంస్థ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేస్తున్నామని అన్నారు.
ఏపీఎస్ఎస్‌డీసీ భాగస్వామ్యంతో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎఎన్ఎం స్పెషలైజేషన్ తో గ్రాడ్యుయేషన్ పొందిన నర్సులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇచ్చి, ప్లేస్ మెంట్ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. స్కిల్‌బీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఎస్ఎస్‌డీసీలు భాషా నైపుణ్య కొరతను పరిష్కరించి, ఏపీని నైపుణ్య రాజధానిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, విశాఖపట్నంలోని ప్రైవేటు నర్సింగ్ కళాశాలలు, ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని 4వేల మందికి పైగా నర్సింగ్ విద్యార్థులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.