సీఎంకు విద్యార్థుల వినతి.. 'సార్ దయచేసి మాకు టీచర్‌ని ఏర్పాటు చేయండి' : వీడియో వైరల్
Sir please arrange a teacher for us Salugu students send SOS to Jagan video goes viral.‘‘సార్.. మా పాఠశాలలో ఉపాధ్యాయులు
By - తోట వంశీ కుమార్ |
పాడేరు : ''సార్.. మా పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు.. మాకు టీచర్‌ను ఏర్పాటు చేయండి'' అని సలుగు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పాఠశాల యూనిఫాంలో ఉన్న బాలిక తన పాఠశాలకు టీచర్‌ను ఏర్పాటు చేయమని ప్రభుత్వ అధికారులను అభ్యర్థిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సలుగు ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు వచ్చారు. అయితే.. వారికి చదువు చెప్పేందుకు ఒక్క టీచర్ కూడా అందుబాటులో లేరు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఆ పాఠశాలలో మొత్తం 33 మంది విద్యార్థులు ఉన్నారు. గత రెండు రోజులుగా విద్యార్థులు వచ్చి వెలుతున్నారు తప్ప ఒక్క ఉపాధ్యాయుడు కూడా పాఠశాలకు రావడం లేదు. ఈ క్రమంలో విద్యార్థులంతా కలిసి మా పాఠశాలకు ఒక టీచర్‌ను ఏర్పాటు చేయండి అని అభ్యర్థిస్తున్నారు.
"Sir! We request you to send a teacher for our school". A video to @ysjagan shared by the tribal students of primary govt school #Salugu panchayat, #Paderu. These 33 students do not have a single teacher at school. @CoreenaSuares2@NewsMeter_In@KanizaGarari@APSchoolEdu pic.twitter.com/JkZiGpt9XM
— SriLakshmi Muttevi (@SriLakshmi_10) July 7, 2022
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలానికి పాఠశాల 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామానికి ఫోన్ లేదా రోడ్డు కనెక్టివిటీ లేదు. "గతంలో ఒక ఉపాధ్యాయురాలు I-V తరగతి వరకు అన్ని సబ్జెక్టులను బోధించేది. అయితే.. ఆమెను బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఎవ్వరిని నియమించలేదు. చదువు చెప్పేందుకు ఎవ్వరూ లేకపోవడంతో మాకు పాఠాలు ఎవరు చెబుతారని విద్యార్థులు ప్రతిరోజు అడుగుతున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నకు మా వద్ద సమాధానం లేదు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు " అని సలుగు పంచాయతీ గ్రామస్థుడు శోభన్ తెలిపారు.
52,600 కోట్లు ఎక్కడికి పోయాయి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగానికి ఇప్పటివరకు రూ.52,600 కోట్లు ఖర్చు చేసింది. కానీ, గిరిజన ప్రాంతాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రజలు అడుగుతున్నారు.
జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ రూ.931 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 47.40 లక్షల కిట్‌లు, స్కూల్ బ్యాగులు, షూలు, రెండు జతల యూనిఫాంలు, బెల్టులు, నోట్‌బుక్‌లు పంపిణీ చేశారు. బైజూస్ లో ఆన్‌లైన్ తరగతులలో పాఠాలను వినేందుకు ఎనిమిది మరియు తొమ్మిదో తరగతి చదువుతున్న మొత్తం 4.08 లక్షల మంది విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.12వేల విలువైన ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. దీని వల్ల రాష్ట్రానికి రూ.500 కోట్ల భారం పడనుంది. 2019-20లో రాష్ట్రం 42.43 లక్షల కిట్లను పంపిణీ చేసింది.
నాడు-నేడు కార్యక్రమం కింద 44,512 ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,351 కోట్లు వెచ్చించింది. మొదటి దశలో 15,571 పాఠశాలలను పునరుద్ధరించారు. 22,344 పాఠశాలల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. ఓ వైపు పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, అనేక గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కూడా లేవు. చాలా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకపోవడం గమనార్హం.