మహా శివరాత్రి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భోళా శంకరుడి దర్శనం కోసం శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అభిషేకాలు, పూజలు చేస్తూ స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారు. తమ కోరికలను నెరవేర్చాలని ఆ పరమ శివుడిని ప్రార్థిస్తున్నారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో పాతాళగంగ కిటకిటలాడుతోంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆదిదంపతులను దర్శించుకుంటున్నారు. భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు నిండిపోయాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించనున్నారు.
వేముల వాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్నను దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
మేళ్లచెరువులోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా కీసరలోని శ్రీరామలింగేశ్వరస్వామిని మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.