శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అనంతరం 48 గంటల్లో తమిళనాడు తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.
తమిళనాడులో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని , కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది.