ఏపీలో విషాదం.. జలపాతంలో మునిగి ముగ్గురు బాలికలు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవులకు గ్రామానికి వచ్చిన స్నేహితురాలితో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన...

By -  అంజి
Published on : 10 April 2026 7:33 AM IST

Alluri District Waterfall Accident, Selfie Drowning Incident, Hukumpeta Mandal Tragedy, Malungummi Waterfall Deaths,Teenage Girls Drowning, Selfie Danger Awareness, Jambuvalasa Village Mourning

ఏపీలో విషాదం.. జలపాతంలో మునిగి ముగ్గురు బాలికలు మృతి 

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవులకు గ్రామానికి వచ్చిన స్నేహితురాలితో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన ముగ్గురు బాలికలు జలపాతంలో మునిగి మృతి చెందారు. హుకుంపేట మండలం జంబువలస గ్రామానికి చెందిన సాలేపు త్రిష (17), సాలేపు రత్నకుమారి (16), సాలేపు పవిత్ర (16), అంజలి అనే నలుగురు స్నేహితులు గురువారం సమీపంలోని అనంతగిరి మండలం మలుంగుమ్మి జలపాతం వద్దకు వెళ్లారు. ఇంటర్ పరీక్షలు ముగించుకుని ఇంటికి వచ్చిన త్రిషతో కలిసి పదో తరగతి వరకు చదువుకున్న మిగతా ముగ్గురు కలిసి ప్రకృతి ఒడిలో కేరింతలు కొడుతూ ఫొటోలు దిగారు.

అయితే, జలపాతం కొండ అంచుల వద్ద నిలబడి నలుగురూ కలిసి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రమాదవశాత్తూ ఒకరు కాలు జారి నీటిలోకి పడిపోగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో మిగిలిన ముగ్గురు కూడా ఒకరినొకరు పట్టుకుని జలపాతంలోకి జారిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే నీటిలోకి దిగి వారిని బయటకు తీసినప్పటికీ, అప్పటికే త్రిష, రత్నకుమారి, పవిత్రలు ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తూ అంజలి గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.

మృతి చెందిన ముగ్గురు బాలికలు ఒకే గ్రామానికి చెందిన అన్నదమ్ముల బిడ్డలు కావడంతో జంబువలస గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అప్పటివరకు కళ్ళముందే ఆడుతూ పాడుతూ గడిపిన తమ బిడ్డలు శవాలుగా మారడం చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. సెల్ఫీ మోజుతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం స్థానికంగా అందరినీ కలిచివేసింది.

Next Story