రేపటి నుంచి 144 సెక్షన్
Section 144 imposed in AP from tomorrow.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేయనుంది.
By తోట వంశీ కుమార్ Published on 4 May 2021 9:13 AM ISTకరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రేపటి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేయనుంది. సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలు చేయొచ్చు. అయితే.. ఆ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమికూడరాదు. ఇక మధ్యాహ్నాం 12 తరువాత షాపులన్నింటినీ మూసివేయాలి. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇక ఇప్పటికే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్.. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో బుధవారం నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూను విధించాలని సీఎం పేర్కొన్నారు. షాపులను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరవాలని.. మధ్యాహ్నం తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతివ్వాలని ఆదేశించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. రెండువారాల పాటు ప్రయోగాత్మకంగా ఈ ఆంక్షలు అమలు చేయాలన్నారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ స్టోరేజీకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, కొరత రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షలు చేయాలని.. ఇది పక్కాగా జరగాలని సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఎంప్యానెల్ (జాబితా)లో ఆస్పత్రుల్లో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు.