ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, బయటకు రాకుండా చూడాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రిని మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈ నెల 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిపై ఆంక్షలను అమలు చేయాలన్నారు.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఎస్ఈసీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిపై ఇటీవల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గవర్నర్‌కు లేఖ లేశారు. ఆ తరువాత కూడా పెద్దిరెడ్డి వెనక్కి తగ్గలేదు. శుక్రవారం సాయంత్రం కూడా మీడియా సమావేశంలో ఎస్ఈసీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఈసి ఆదేశాలను పాటించి ఏకగ్రీవాలను నిలిపివేస్తే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగిస్తాయని ఎస్ఈసి భావించింది. దీంతో మంత్రిపెద్దిరెడ్డిపై ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది.