ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టం నేడు ప్రారంభ‌మైంది. తొలి విడుత ఎన్నిక‌ల నామినేష‌న్ల ప్రక్రియ మొద‌లైంది. మరోవైపు ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్థుల‌కు కుల‌ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, ఎన్ఓసీల జారీ అంశంపై సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ లేఖ రాశారు. కులధృవీక‌ర‌ణ ప‌త్రాల‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ ఫోటోను తొల‌గించాల‌ని.. వెంట‌నే ఈ మేర‌కు త‌హ‌సీలార్ద‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని సూచించారు. ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌పై సీఎం ఫోటో ఉండ‌డం ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి విరుద్దం అని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. కుల ధృవీకరణ పత్రాలు, ఎన్వోసీల జారీలో వివక్ష, జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు నిమ్మ‌గ‌డ్డ‌.

ఇదిలా ఉంటే.. గురువారం జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. అధికారులు కావాల‌నే ధృవీక‌ర‌ణ ప‌త్రాలు జారీలో జాప్యం చేస్తున్నార‌ని.. దీని వ‌ల్ల ప‌రిశీల‌న‌లో అభ్య‌ర్థుల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంద‌ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక.. ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీకి ఇప్పటికే కొన్ని ఫిర్యాదు అందాయి. దాంతో.. రాయలసీమ జిల్లాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు నిమ్మగడ్డ. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.


తోట‌ వంశీ కుమార్‌

Next Story