ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 517 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించవద్దంటూ కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు ఫలితాలను హోల్డ్‌లో ఉంచాలని పేర్కొంది. ఆయా జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను ఎస్ఈసీ వివరణాత్మక నివేదిక కోరింది. నివేదికలు పరిశీలించాకే కమిషనర్ తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేసింది. వైఫల్యాలు ఉంటే చర్యలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది.
చిత్తూరులో 110, గుంటూరులో 67 పంచాయితీలు ఏకగ్రీవాలయినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. చిత్తూరు వైకాపా 95, టీడీపీ 9, స్వతంత్రులు 6 ఏకగ్రీవమయ్యాయి. ఇక గుంటూరులో మొత్తం 67 పంచాయితీ ఏకగ్రీవమవగా.. అందులో 63 వైకాపా, 2 టీడీపీ, 2 స్వతంత్రుల ఖాతాలో పడ్డాయి. తాజాగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగులో పెట్టాలని నిమ్మగడ్డ ఆదేశించారు.