అనంతపురం జిల్లాలో స్క్రబ్‌ టైపస్ కలకలం, వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన మధు అనే 20ఏళ్ల యువకుడు స్క్రబ్‌ టైపస్‌ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on  15 Sept 2023 10:52 AM IST
Scrub Typhus, kills, man, anantapur,  odisha,

అనంతపురం జిల్లాలో స్క్రబ్‌ టైపస్ కలకలం, వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన మధు అనే 20ఏళ్ల యువకుడు స్క్రబ్‌ టైపస్‌ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో జిల్లాలో ఈ మరణం కలవరం ఏపుతోంది. ఇలాంటి అరుదైన వ్యాధితో ఒకరు మరణించడం అనంతపురం జిల్లాలో ఇదే మొదటిసారి. కాగా.. కొద్ది రోజుల క్రితం మధుకు జ్వరం వచ్చింది. దాంతో.. అతడు ధర్మవరం, అనంతపురంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించుకున్నాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దాంతో.. వైద్యులు బెంగళూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాలని సూచించగా.. గత నెల 31న అక్కడికి వెళ్లాడు. బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ గురువారం రోజున మధు ప్రాణాలు కోల్పోయాడు.

మధు స్ర్కబ్‌ టైపస్ వ్యాధితోనే మృతిచెందాడని ప్రచారం జరగడంతో.. జిల్లా వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. మధు స్వగ్రామం పోతుకుంటకు ప్రత్యేక బృందాన్ని కూడా పంపారు. ఆస్పత్రి రికార్డుల్లో కూడా మధు స్క్రబ్‌ టైపస్ వ్యాధితోనే మృతిచెందినట్లు నమోదు అయ్యి ఉంది. దాంతో... వైద్యాధికారులు ఉన్నతాధికారులకు ఆ రిపోర్టును పంపారు. ఇది ఓ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ అని.. కీటకం కుట్టడం ద్వారా మనిషికి సోకుతుందని తెలిపారు. మధు అదే వ్యాధితో చనిపోవడం వల్ల పోతుకుంట గ్రామంలో కీటక నివారణి స్ప్రే చేశారు. మధు కుటుంబ సభ్యులను ఐసోలేట్‌ చేస్తున్నారు అధికారులు.

ఒడిశాలో ఇదే వ్యాధి కారణంగా 5 మంది ప్రాణాలు కోల్పోయారు.. సిమ్లాలో 9 మంది చనిపోయారు. జంతువుల చర్మంపై ఉండే చిన్న పురుగు(గోమర్)లా ఉండేది కుట్టడం వల్ల స్క్రబ్‌ టైప్ వ్యాధి సోకుతుంది. అత్యంత అంటువ్యాధి అయిన ఈ వ్యాధి దేశంలో పలుచోట్ల మరణాలకు దారి తీస్తోంది. దాంతో.. అధికారులు అలర్ట్‌ అవుతున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. తోటపని, బహిరంగ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న వ్యక్తులు సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎలుకల నియంత్రణ, పరిశుభ్రత పై దృష్టి పెట్టడం ద్వారా వ్యాధి బారిన పడకుండా నిరోధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Next Story