ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్.. నాడు-నేడు, అంగన్ వాడీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మొదటి విడుదల నాడు-నేడు పనులను ఆగస్టు 16నే ప్రజలకు అంకితం చేస్తామన్నారు.
అనంతరం రెండో విడుదల పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.ఆ రోజే నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్ తెలిపారు.విద్యార్థిని, విద్యార్థులకు 'విద్యా కానుక' కిట్లను కూడా అందచేయనుంది. ప్రైవేటు స్కూల్స్ కూడా తిరిగి ఓపెన్ చేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాగా.. ఇప్పటికే పది, ఇంటర్, ఇతర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా రెండు విద్యా సంవత్సరాలు నష్టపోయాయి. పూర్తిగా ఆన్ లైన్ క్లాసులకు విద్యార్థులు పరిమితమయ్యారు.