విద్యార్థుల తప్పులకు స్వయంగా శిక్ష వేసుకున్న ఉపాధ్యాయుడు
ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ వినూత్నంగా ఆలోచించాడు. విద్యార్థులు తప్పు చేస్తే తనకు తానే శిక్ష విధించుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 16 Sep 2023 2:57 AM GMTవిద్యార్థుల తప్పులకు స్వయంగా శిక్ష వేసుకున్న ఉపాధ్యాయుడు
విద్యార్థులు తప్పు చేస్తే దారిలో పెట్టేందుకు ఉపాధ్యాయులు పనిష్‌మెంట్ ఇస్తారు. సరైన దారిలో నడవాలంటూ సూచిస్తారు. క్రమశిక్షణగా ఉండాలంటూ చెబుతారు. పనిష్మెంట్ కింద క్లాస్ బయట నించో పెట్టడం, మోకాళ్ల దండ వేయడం, వంగమనడం, గోడ కూర్చి వేయించడం చేసేవారు. ఇక అల్లరి చేస్తే బెత్తం పెట్టి కొట్టేవారు. ఇప్పుడంటే విద్య వ్యాపారంగా మారిపోయింది. అంతేకాదు.. విద్యార్థులను దారిలో పెట్టేందుకు పనిష్మెంట్ ఇచ్చినా కొందరు తప్పుగా ఎత్తిచూపుతున్నారు. ఇక ప్రభుత్వ బడుల్లో అయితే కొన్ని చోట్ల పట్టించుకునే నాథుడే ఉండరు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రయివేట్ స్కూల్స్‌లో చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పిస్తూ.. క్రమశిక్షణలో ఉంచి బాగా చదివించాలనుకున్నాడు ఓ ఉపాధ్యాయుడు. ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ వినూత్నంగా ఆలోచించాడు.
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని ఎస్ఆర్ కండ్రిగ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోహర్నాయుడు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తాను పనిచేసే పాఠశాలలో విద్యార్థులు నిత్యం సకాలంలో రావాలని, తప్పక యూనిఫాం ధరించాలని మొదట్లోనే సూచించారు. క్రమశిక్షణ తప్పితే శిక్ష విద్యార్థులకు ఇవ్వబోనని, తానే ఆ శిక్ష అనుభవిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆలస్యంగా రావడం, యూనిఫాం ధరించకపోవడం గమనించారు. ఆయన ముందుగా చెప్పినట్లే తనకు తానే శిక్ష వేసుకున్నాడు. మోకాళ్లపై నిల్చొని చేతులు కట్టుకుని తనకు తాను శిక్ష విధించుకున్నాడు. అక్కడ పనిచేసే మరో ఉపాద్యాయులు ఆయన స్వయంగా శిక్ష విధించుకోవడంపై ఫొటో తీశారు. వారి ఫోన్ నుండి లీక్ అయిన ఈ చిత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది. పిల్లలు తప్పు చేస్తే మార్కుల్లోనే, చేతల్లోనే చూపించే ఉపాధ్యాయులు ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి ప్రధానోపాధ్యాయుడు ఉండటం చాలా అరుదు.