దసరా సెలవులు ముగియడంతో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులకు తీసుకుని పాఠశాలకు వెలుతున్న క్రమంలో అదుపు తప్పి చెరువులో పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో బుధవారం ఉదయం జరిగింది.
కొంగర గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలోని నల్ల చెరువులో బుధవారం ఉదయం అదుపు తప్పి పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు చెరువులో పడి పోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. చెరువులోకి దూకి బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు లాగారు. అప్పటికే ఓ విద్యార్థి మృతి చెందగా.. మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థిని బడివానిపేటకు చెందిన మైల్లపల్లి రాజు(8)గా గుర్తించారు. బస్సును జేసీబీ సాయంతో బయటకు తీశారు. బాలుడి మృతితో ఆ ఇంట విషాద చాయలు అలుముకున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.