ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల పై కప్పు కూలి విద్యార్థి మృతి చెందిన ఘటన మార్కాపురం మండలం రాజుపాలెంలో చోటు చేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో.. చుట్టుప్రక్కల నివాసం ఉంటున్న చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలో ఆడుకుంటున్నారు. వారు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పాఠశాల పై కప్పుకుప్పకూలింది. ఈ ఘటనలో విష్ణు అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విష్ణు ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. శిథిలాల నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.