చంద్రబాబుని సీఎం చేయడానికే పవన్ వారాహి యాత్ర: సజ్జల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
By Srikanth Gundamalla
చంద్రబాబుని సీఎం చేయడానికే పవన్ వారాహి యాత్ర: సజ్జల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్ వారాహి యాత్రపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుని సీఎం చేయడం కోసమే యాత్ర చేపట్టారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కచ్చితమైన ఆలోచనలతో రాజకీయాలు చేయడం లేదన్నారు. గతంలో రెండుసార్లు పవన్ కల్యాణ్ చంద్రబాబునే మోశారన్నారు సజ్జల. ఇప్పుడు మరోసారి చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని తేటతెల్లమైందన్నారు. పవన్ కల్యాణ్ కేవలం సినీ హీరోగా తనకున్న పాపులారిటీని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఇన్నాళ్లు పవన్ కల్యాణ్ ఎందుకు వారాహి యాత్ర చేపట్టలేదు..? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓ రాజకీయ పార్టీ అధినేతకు విలువలు ఉంటాయని.. పవన్‌కు అవివేవి లేవంటూ మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన నాలుగైదు డైలాగులు పవన్ కల్యాణ్ చెబుతున్నాడని.. తనని నమ్మినవాళ్లను మోసం చేస్తున్నాడని అన్నారు. అంతేకాదు చంద్రబాబు కోసమే వారాహి యాత్ర చేస్తూ ప్రజలను కూడా మోసం చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని సీఎం చేయడమే తన లక్ష్యం అని పవన్ కల్యాణ్ ఓపెన్‌గానే చెబుతున్నారని ఫైర్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు తగవన్నారు. రాబోయే ఎన్నికల్లో బలమైన నాయకత్వం రావడం ఖాయమని.. మరింత మెజార్టీతో జగన్ మళ్లీ సీఎం అవుతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీమా వ్యక్తం చేశారు.