ఐటీ నోటీసులపై చంద్రబాబు ఏం చెప్తారు?: సజ్జల

చంద్రబాబు అవినీతి పాల్పడిన విషయం తేటతెల్లం అయ్యిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

By Srikanth Gundamalla  Published on  2 Sep 2023 8:15 AM GMT
Sajjala,  Chandrababu, IT Notice,

ఐటీ నోటీసులపై చంద్రబాబు ఏం చెప్తారు?: సజ్జల 

చంద్రబాబు అవినీతి పాల్పడిన విషయం తేటతెల్లం అయ్యిందని వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతిపై జాతీయ మీడియా పూర్తిస్థాయిలో వార్తలు రాశాయని.. చంద్రబాబు దీనిపై ఏం మాట్లాడుతారు? ప్రజలకే ఏం చెప్తారు అని సజ్జల ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

2020లో ఒకసారి, మరోసారి 2021లో ఐటీ దాడులు జరిగాయని అన్నారు సజ్జల. మనోజ్‌ దేవ్, శ్రీనివాస్‌ ఇళ్లలో తనిఖీలు ఐటీ అధికారులు చేశారని అన్నారు. ఎల్‌ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీల ద్వారా షెల్ కంపెనీలకు వెళ్లి, అక్కడి నుంచి చంద్రబాబుకి నిధులు అందాయని ఐటీ అధికారులు తెలిపారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఐటీ నోటీసుల్లోనూ ఇదే ఉందని అన్నారు. అయితే.. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నోటీసులపై సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ ఐదారుసార్లు చంద్రబాబు సమాధానం చెప్తూ వచ్చారనీ.. కానీ ఆ సమాధానాలేవీ నిలబడవు అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఐటీ అధికారులు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా.. సాంకేతిక అంశాలంటూ ఏవేవో చెప్తూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. అయితే.. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా అవినీతిమయంగానే కొనసాగుతూ వచ్చిందని విమర్శలు చేశారు. కొన్ని తరాలపాటు లాభం పొందేలా చంద్రబాబు స్కాం చేశారని అన్నారు సజ్జల. కిట్‌ బ్యాగ్స్‌ అందాయని పూర్తి సమాచారం ఉన్నందునే ఐటీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. అమరావతి విషయంలో తనతోపాటు, తనవారంతా లాభం పొందేలా చంద్రబాబు చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారని చంద్రబాబు, టీడీపీ నాయకులపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story