చంద్రబాబు మెడికల్ రిపోర్ట్‌ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల

చంద్రబాబు హెల్త్‌ రిపోర్ట్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 3:39 PM IST
sajjala,  chandrababu, health bulletin,

 చంద్రబాబు మెడికల్ రిపోర్ట్‌ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల 

టీడీపీ అధినేత చంద్రబాబుకి సంబంధించి వైద్యులు హెల్త్‌ రిపోర్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రిపోర్ట్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో అరెస్ట్‌ అయ్యిన ఆయన.. ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నారని చెప్పారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేస్తే బెయిల్‌ వస్తుందని అన్నారు. ఆ కారణంతోనే చంద్రబాబుకి తాత్కాలిక బెయిల్ లభించిందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ బెయిల్‌ పైనే మరికొంత కాలం బయట ఉండేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబుకి గుండె జబ్బు అని హెల్త్‌ రిపోర్ట్‌లో పేర్కొనడం.. ఆ రిపోర్టును చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు సమర్పించారు. దీనిపై మాట్లాడిన సజ్జల ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో చర్మవ్యాధులను ప్రాణాంతక వ్యాధులుగా చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అనారోగ్యం కారణంగా బెయిల్‌పై బయటకు వచ్చాక.. 14 గంటలకు పైగా ప్రయాణం చేశారని అన్నారు. అడుగడుగునా కార్యకర్తలు వచ్చే వరకు వేచి ఉంటూ మెల్లిగా ఇంటికి చేరుకున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.

రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నా, వారి డాక్టర్లు హైదరాబాదులోనే ఉన్నా... చంద్రబాబు ఇక్కడికి వచ్చి, ఇట్నుంచి హైదరాబాద్ వెళ్లారని సజ్జల వివరించారు. ఇలాంటప్పుడే ఏదైనా అనాల్సి వస్తుందనీ.. కానీ ఏదైనా అంటే కోపాలు వస్తాయని చెప్పారు. ఇక హైదరాబాద్‌కు వెళ్లిన చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు బెయిల్‌ పొంది రాజకీయ సమావేశాలు నిర్వహించారు. రెగ్యులర్ బెయిల్‌ వచ్చినప్పుడు ఇలా అడగము కానీ.. శస్త్ర చికిత్స కోసం వెళ్లి వేరే పనులు చేస్తున్నారని అన్నారు. ఇక ఇప్పుడు కంటి చికిత్స, చర్మవ్యాధులకు చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుందన్నట్లుగా హంగామా చేస్తున్నారంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story