ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కందుకూరు నుంచి కనిగిరి వెలుతున్న ఆర్టీసీ బస్సు పొన్నలూరు మండలం రెడ్డిపాలెం గ్రామం సమీపంలోని చెరువు కట్టపైకి రాగానే ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడి చెరువులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 28 మంది ప్రయాణీకులు ఉన్నారు. చెరువులో చేపలు పట్టే వారు గమనించి వెంటనే బస్సు దగ్గరకు వచ్చి ప్రయాణీకులను బస్సులోంచి బయటకు లాగారు. ఈ ప్రమాదంలో ప్రయాణీలు స్వల్పగాయాలతో బయట పడ్డారు.
ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చెట్లు అడ్డుగా ఉండడంతో పూర్తిగా చెరువులోకి పడిపోకుండా ఆగిందని ప్రయాణీకులు చెబుతున్నారు. ఒకవేళ చెరువులోకి పూర్తిగా బస్సు పడిపోయి ఉంటే.. పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ప్రయాణీకులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మరో బస్సులో ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చే ఏర్పాట్లు చేశారు.