రౌడీ షీటర్ దారుణ హత్య..
Rowdy Sheeter brutally murdered.ఆంధ్రప్రదేశ్‌లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2021 10:26 AM ISTఆంధ్రప్రదేశ్‌లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి బయట పుట్‌పాత్‌పై కూర్చున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేసి.. కత్తులతో పొడిచి హతమార్చారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా మద్దిలపాలెం సమీపంలోని కేఆర్ఎం కాలనీకి చెందిన రౌడీ షీటర్ వెంకట్‌రెడ్డి అలియాస్ బండరెడ్డి తన ఇంటికి సమీపంలోని పుట్‌పాత్‌పై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో బైక్‌పై ఇద్దరు, కారులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి వచ్చి ఒక్కసారిగా దాడికి దిగారు.
వెంకట్‌రెడ్డి తలపై బలంగా గాయం కావడంతో కిందపడ్డారు. వెంటనే కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర రక్తస్రావం అయి అక్కడిక్కడే బండరెడ్డి మృతి చెందాడు. విభేదాల కారణంగా అతడితోపాటు తిరిగే వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, ఆధిపత్యం కోసమే ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బండరెడ్డికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. డబ్బులు తీసుకుని నేరాలు చేసేవాడన్నారు. అతడిపై రెండు హత్యకేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.