ఆనందయ్య మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య మృతి
Retired head master kotaiah Died.నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్
By తోట వంశీ కుమార్ Published on 31 May 2021 11:20 AM ISTనెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. కరోనాతో గత పది రోజులుగా నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కోటయ్య మరణించారు. ఆయన పరిస్థితి విషమించడంతో గత నాలుగు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ ద్వారా ట్రీట్‌మెంట్ అందిస్తూ వస్తున్నారు. అయినప్పటికి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం ఆయన కన్నుమూశారు.
కృష్ణపట్నంలో కరోనాకు మందు ఇస్తున్నారని తెలుసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కొన్ని రోజుల క్రితం ఆ మందు వేయించుకున్న విషయం తెలిసిందే. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా మెరుగుపడని తన ఆరోగ్యం ఆనందయ్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుపడిందని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు కోసం ఇప్పటికీ జనాలు కృష్ణపట్నం వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించారు.
ఇదిలా ఉంటే.. ఆనందయ్య మందుపై నేడు( సోమవారం) హైకోర్టులో విచారణ జరగనుంది. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా.. ఆనందయ్య మందు తిరిగి పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారా? అని ప్రజలంతా ఎదురుచూస్తున్న సమయంలో కోటయ్య మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనతో ఆనందయ్య మందు కరోనాను అంతం చేయగలదా? లేదా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.