కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వైద్య ప్రక్రియలో శాస్త్రీయతపై నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా బాధితులకు ఆనందయ్య ఇస్తున్న మందు పై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా అధ్యయనం ప్రారంభించాయి. ఆనందయ్య వద్ద చికిత్స పొందిన సుమారు 500 మంది వద్ద నుంచి వివరాలు సేకరించింది. వీటి ఆధారంగా తొలుత జంతువులు, ఆ తరువాత మానవులపై క్లినకల్ ట్రయల్స్ జరగనున్నాయి.
ఆ తరువాతే ఆనందయ్య వైద్యం ఆయుర్వేద ప్రమాణాలకు తగ్గట్లుగా ఉందా లేదా అన్నది కేంద్ర ఆయుర్వేద సంస్థ నిర్థారిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. యుద్ద ప్రాతిపదికనా పరిశోధనలు జరిగినా.. ఫలితాలు వచ్చేందుకు కనీసం 2, 3 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో అయితే.. అధ్యయనానికి కనీసం ఏడాది సమయం పట్టనుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చొరవతో కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ వెంటనే రంగంలోకి దిగింది.
శాస్త్రీయ అధ్యయనంలో టీటీడీ కమిటీ..
ఆనందయ్య తయారు చేసిన మందును అనేకమంది కరోనా బాధితులకు పంపిణీ చేశారు. వారి నుంచి వివరాలు సేకరించి, ఆ మందులో కరోనాను నివారించే గుణాలు ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు టీటీడీ చైర్మన్, ఈవోల ఆదేశాల మేరకు టీటీడీ ఆయుర్వేద వైద్యకళాశాల హెచ్‌వోడీలతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ రేణుదీక్షిత్ పర్యవేక్షణలో ఆయుర్వేద వైద్యులు శ్రీదుర్గ, లక్ష్మణప్రసాద్, శ్రీనివాస్‌కుమార్, ఇన్‌చార్జ్ హెచ్‌వోడీలు రాగమాల, గోపాలకృష్ణలను కమిటీలో నియమించారు. వీరితోపాటు పీజీ విద్యార్థులు సుమారు 50 మంది ఈ అధ్యయనంలో పాల్గొంటున్నారు. విజయవాడకు చెందిన కొందరు ఆయుర్వేద వైద్యులు కూడా ఈ పరిశోధనలో భాగస్వాములయ్యారు. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారికి ఈ మందు పనిచేసిందా? లేదా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈ మందు తీసుకున్నాక రానున్న రోజుల్లో ఎలా పనిచేయనుంది? అనే వివరాలు సేకరిస్తున్నారు. వివరాలన్నీ సేకరించాక.. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్‌ఏఎస్)కు నివేదిక పంపనున్నారు.