కరెంట్ సమస్యలా? ఈ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయండి: APEPDCL

విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని...

By -  అంజి
Published on : 17 Feb 2026 10:34 AM IST

APEPDCL WhatsApp Helpline, Power Complaint Number 1912, CMD Prudhvitej Dial Your CMD, Electricity Bill Complaints AP, Farmers Power Issues, APEPDCL News Telugu

కరెంట్ కష్టాలా? ఇకపై వాట్సాప్‌లోనే ఫిర్యాదు చేయండి: ఏపీఈపీడీసీఎల్ కొత్త సర్వీస్!

అమరావతి: విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ. పృధ్వీతేజ్ స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమంలో భాగంగా ఆయన వినియోగదారులతో నేరుగా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను వెల్లడించారు.

ఫిర్యాదు చేయడానికి మార్గాలు:

వాట్సాప్ నంబర్: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, బిల్లుల తప్పులు వంటి సమస్యలను 9493681912 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

టోల్-ఫ్రీ నంబర్: వినియోగదారులు నేరుగా 1912 నంబర్‌కు కాల్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

డయల్ యువర్ సీఎండీ:

ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈసారి సీఎండీకి మొత్తం 45 ఫిర్యాదులు అందాయి. గత వారం వచ్చిన 47 ఫిర్యాదులలో ఇప్పటికే 38 సమస్యలను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు, విద్యుత్ శాఖకు మధ్య ఈ కార్యక్రమం ఒక వారధిలా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సోమవారం వచ్చిన కాల్స్‌లో వినియోగదారులు, రైతులు ప్రధానంగా కొన్ని సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు.

అందులో కొత్త వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో జరుగుతున్న జాప్యం, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న తీగలను మార్చడం, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో మార్చకపోవడం, కరెంట్ బిల్లులలో తప్పులు, పేరు మార్పిడి సమస్యలు, లో-వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను సీఎండీ పృధ్వీతేజ్ ఆదేశించారు.

Next Story