Annamayya District: కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి చంపిన ఎర్రచందనం స్మగ్లర్లు
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు ఓ కానిస్టేబుల్‌ను హత్య చేశారు.
By అంజి Published on 6 Feb 2024 6:45 AM GMTAnnamayya District: కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి చంపిన ఎర్రచందనం స్మగ్లర్లు
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు ఓ కానిస్టేబుల్‌ను హత్య చేశారు. కెవి పల్లె మండలం చీనేపల్లి గ్రామంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ సోమవారం రాత్రి సోదాలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎర్రచందనం తీసుకెళ్తున్న కారును ఒక కానిస్టేబుల్ గుర్తించినప్పుడు, డ్రైవర్‌ను ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. అయితే స్మగ్లర్లు అతడిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పోలీసు పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) 14వ బెటాలియన్‌కు చెందిన గణేష్‌గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత టాస్క్ ఫోర్స్ సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసి కారుతో పాటు ఇద్దరు స్మగ్లర్లను పట్టుకుని ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న రాయలసీమ ప్రాంతం ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రసిద్ధి చెందింది, ఇది ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న అరుదైన కలప. అవిభాజ్య చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో ఉన్న శేషాచలం అటవీప్రాంతం అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ఆగడాలకు గురవుతోంది. చైనా, మయన్మార్, జపాన్, తూర్పు ఆసియాలోని ఇతర దేశాలలో సాంప్రదాయ ఔషధాలు, చెక్క వస్తువులలో ఈ విలువైన కలపను ఉపయోగిస్తారు. 2022లో టాస్క్ ఫోర్స్ 73 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి 50 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకుంది.