వారం రోజులు రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మూసివేత
Rajamahendravaram Road-cum-rail bridge to be closed for one week.రాజమహేంద్రవరం అనగానే అందరికి మొదటగా
By తోట వంశీ కుమార్
రాజమహేంద్రవరం అనగానే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది రోడ్ కమ్ రైలు వంతెన. నిత్యం భారీగా రాకపోకలు సాగే ఈ బ్రిడ్జిని వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మతుల కోసం వంతెనను నేటి నుంచి మూసివేస్తున్నారు. ట్రాఫిక్‌ను ధవళేశ్వరం, కాటన్ బ్యారేజీ, గామన్ వంతెన మీదుగా మళ్లిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ బ్రిడ్జిని వారం రోజుల పాటు మూసివేయడం వివాదాస్పదం అవుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతినే రాజధానిగా ఖరారు చేయాలన్న డిమాండ్ వినిపిస్తూ అమరావతి రైతులు ఈ బ్రిడ్జిపై నుంచి ఈ నెల 17న పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర పూరితంగానే మూసివేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మరో రెండు రోజులు సమయం పెరుగుతుంది
అమరావతి రైతు ఐకాస కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ.. అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందన్నారు. రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై రాకపోకలకు స్థానికులు అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మరమ్మతులు చేయాలని నిర్ణయించడం సంతోషమన్నారు. వంతెన మూసివేసినంత మాత్రాన తమ మనోధైర్యం దెబ్బతినదని, పాదయాత్రలో మరో రెండు రోజులు సమయం పెరుగుతుందన్నారు. ఉన్న మార్గాల్లోనే పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.