రాజమండ్రి కల్తీ పాల ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో కలుషిత పాలు తాగడం వల్ల సంభవించిన మరణాల సంఖ్య ఆదివారానికి 12కు చేరుకుంది.

By -  అంజి
Published on : 9 March 2026 9:08 AM IST

Milk Adulteration Tragedy, Ethylene Glycol Poisoning, Rajahmundry News, Acute Renal Failure, Varalakshmi Milk Centre, Contaminated Milk Deaths, Forensic Science Laboratory (FSL), Kidney Damage Victims

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య 

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో కలుషిత పాలు తాగడం వల్ల సంభవించిన మరణాల సంఖ్య ఆదివారానికి 12కు చేరుకుంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో (Acute Renal Failure) చికిత్స పొందుతున్న సేనాపతి రామలక్ష్మి (73) అనే వృద్ధురాలు మరణించడంతో ఈ విషాదం మరింత ముదిరింది. గత నెల ఫిబ్రవరి 16న పాలు తాగిన తర్వాత అనారోగ్యానికి గురైన ఆమె, అప్పటి నుండి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశారు.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు అనే వ్యక్తి నిర్వహించే 'వరలక్ష్మి మిల్క్ సెంటర్' నుండి పాలు కొనుగోలు చేసిన దాదాపు 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు పసికందులు సహా మరో తొమ్మిది మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. పాలలో అత్యంత విషపూరితమైన 'ఇథిలీన్ గ్లైకాల్' (Ethylene Glycol) కలవడం వల్ల బాధితుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు ధృవీకరించాయి. ఫిబ్రవరి 16నే బాధితులు ఆసుపత్రుల్లో చేరినప్పటికీ, ఫిబ్రవరి 22న తాడి కృష్ణవేణి (76) అనే వృద్ధురాలు కాకినాడ జీజీహెచ్‌లో మరణించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మూత్రపిండాల పనితీరు ఆగిపోవడం (Anuria) వంటి లక్షణాలు ఒకే ప్రాంతానికి చెందిన పలువురిలో కనిపించడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడు గణేశ్వరరావు 43 మంది రైతుల నుండి పాలు సేకరించి తన ఇంట్లోని ఫ్రీజర్‌లో నిల్వ చేసేవాడు. అయితే ఆ ఫ్రీజర్ లీక్ అవుతుండటంతో, అతను దానికి 'ఎమ్-సీల్' (M-seal) వేయించి మరమ్మతు చేయించాడు. ఆ సమయంలోనే కూలింగ్ కోసం వాడే విషపూరిత కెమికల్ పాలలో కలిసినట్లు అధికారులు గుర్తించారు. పాలు చేదుగా ఉన్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేసినా అతను నిర్లక్ష్యం వహించాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాలు, పెరుగు నమూనాలను సేకరించి మరిన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.

Next Story