రాజమండ్రి: చంద్రికా అవంతిక ఫేజ్ 2లో ఫ్లాట్‌లు తక్కువ ధరకే ఇస్తామంటూ మోసం

ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కేవలం రూ.26 లక్షలకు ఇస్తామంటూ చెప్పడంతో ఎంతో మంది మిడిల్ క్లాస్ జనం డబ్బులు కట్టేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2024 2:15 PM IST
rajahmundry,  raki avenue, cheat,   flats,  chandrika avanthika phase,

రాజమండ్రి: చంద్రికా అవంతిక ఫేజ్ 2లో ఫ్లాట్‌లు తక్కువ ధరకే ఇస్తామంటూ మోసం 

రాజమండ్రి: ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కేవలం రూ.26 లక్షలకు (సుమారుగా) ఇస్తామంటూ చెప్పడంతో ఎంతో మంది మిడిల్ క్లాస్ జనం డబ్బులు కట్టేశారు. తీరా చూస్తే కొన్నాళ్లకు తామంతా మోసపోయామని బాధితులు గ్రహించారు. రాజమండ్రిలో చాలా మంది ఈ ఇళ్లను కొనుగోలు చేయడానికి కష్టపడి సంపాదించిన డబ్బును మొత్తం పెట్టేసి.. చివరికి పోగొట్టుకున్నామని తెలిసి బాధ పడుతూ ఉన్నారు.

రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ ఫ్లాట్‌లను అమ్మడానికి, ప్రజలను ఆకర్షించడానికి ప్రఖ్యాత తెలుగు యాంకర్ సుమ కనకాలతో యాడ్స్ కూడా చేయించారు. అయితే ఇలా సెలెబ్రిటీలను చూపించి.. ప్రజలను మోసం చేసి డబ్బును దోచుకునే ఎత్తుగడ మాత్రమే ఇదని తెలుస్తోంది.

రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన చంద్రికా అవంతిక ఫేజ్-2 ఫ్లాట్‌ల కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించి చాలా కుటుంబాలు మోసపోయామని అంటున్నారు. రాకీ అవెన్యూ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు పరారీలో ఉన్నారని, తన కస్టమర్లకు ఏ మాత్రం స్పందించడం లేదని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన వేణు రామయ్య విజయవాడ, రాజమండ్రి, అమలాపురంలో గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణంలో భాగంగా ఉన్నారు.

చంద్రిక అవంతిక ఫేజ్ 1 ఫ్లాట్‌లను వేల మంది కొనుగోలు చేశారు. దీంతో రాకీ అవెన్యూస్ 2వ ఫేజ్ ను ప్రారంభించింది. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లను రూ. 16 లక్షలకు, ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లను సుమారు రూ. 26 లక్షలకు విక్రయించింది.

నాలుగేళ్లు గడిచినా నిర్మాణం పూర్తవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేజ్ 2లో ఫ్లాట్ కోసం దాదాపు 150 మంది వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించారు. "చంద్రికా అవంతిక ఫేజ్-2 గురించి యాంకర్ సుమ కనకాల చేసిన ప్రకటన చూసి, రూ. 26 లక్షలు చెల్లించి మూడు పడక గదుల ఫ్లాట్‌ను బుక్ చేశాను. నాలుగేళ్లు గడిచినా వారు స్పందించలేదు. దీన్ని నా పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నాం. రాకీ అవెన్యూ కార్యాలయంలో ఒకప్పుడు ఉద్యోగులు ఉండేవారు, కానీ ఇప్పుడు మా ప్రశ్నలకు సమాధానం చెప్పే వారు ఎవరూ లేరు" అని ఒక బాధితుడు చెప్పాడు.

రూ.30,000 వేతనం పొందుతున్న ఓ ఉద్యోగి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కోసం రుణం తీసుకుని రూ.16 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు. “నేను ప్రతి నెలా రూ. 10,000 EMI చెల్లిస్తూ వస్తున్నాను. దాదాపు నాలుగేళ్లుగా నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. రిజిస్ట్రేషన్‌కు ముందు, రామయ్య వేణు మా ప్రశ్నలకు చాలా స్నేహపూర్వకంగా స్పందించారు, కానీ ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు. మాకు ఇప్పుడు ఫ్లాట్ అవసరం లేదు, కనీసం మా డబ్బునైనా మాకు తిరిగి ఇవ్వండి, ” అని బాధితుడు వాపోయాడు.

"నేను దాదాపు రూ. 1 కోటి చెల్లించి, ఫిబ్రవరి 2021లో నా పిల్లలకు నాలుగు ఫ్లాట్లు కొన్నాను. నేను ఫేజ్ 1 ఫ్లాట్‌లను చూసి మిగిలిన ఫేజ్ లో కూడా మంచి నిర్మాణాలు చేస్తారని నమ్మాను. రెండేళ్లలో మాకు ఫ్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. 35 మంది సభ్యులు ఉన్న మా గ్రూపులో మేము రుణం తీసుకున్నాము. మా కుటుంబానికి ఒక ఫ్లాట్ కోసం అప్పులు కూడా చేసాము, చివరికి మేము మోసపోయాము, ”అని చెప్పారు. తాను రిటైర్డ్ అయ్యాక వచ్చిన డబ్బును ఇందులో పెట్టుబడిగా పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. తమ సమస్యను మీడియాకు విన్నవించిన బాధితులు ఉన్నతాధికారులు, స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.

Next Story