రెయిన్ ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండగా మారింది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 3:00 AM GMTరెయిన్ ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండగా మారింది. వాయుగుండానికి తోడుగా మరో రుతుపవన ద్రోణి కూడా ఏర్పడింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమలోనే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాలతో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాల నేపథ్యంలో సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వానలు కురుస్తున్నాయి. విజయవాడ రహదారిలో భారీ వరద పోటెత్తి..పూర్తిగా జలమయం అయ్యాయి. కలెక్టర్ సృజన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం-కేశ్యాతండా మధ్య వాగులో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దాంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రకాశం బ్యారేజీలో మొత్తం 70 గేట్లు ఎత్తేశారు అధికారులు. దిగువకు 3,32,374 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపరం, యర్రగొండపాలెంలో శుక్రవారం నుంచి భారీ వర్షం కురుస్తోంది.