పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో హత్యాయత్నం...
By - అంజి |
పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏడో నిందితుడిగా (A-7) ఉన్న బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ నాయక్ గురువారం గుంటూరులోని సీసీఎస్ (CCS) పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
2021 మే నెలలో రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, గుంటూరులోని ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో సీఐడీ డీఐజీగా ఉన్న సునీల్ నాయక్, కస్టడీలో ఉన్న రఘురామపై దాడికి ప్రేరేపించారని లేదా పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా ఆ రాత్రి సునీల్ నాయక్ పలుమార్లు సీఐడీ కార్యాలయానికి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి.
గతంలో సునీల్ నాయక్ విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన రాలేదు. ఏపీ పోలీసులు పట్నాకు వెళ్లి ఆయన్ను అరెస్టు చేసినా, ట్రాన్సిట్ వారెంట్ లభించకపోవడంతో రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు ప్రతిరోజూ దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది.
దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో నేడు విచారణకు రావాల్సి వచ్చింది. విజయనగరం ఎస్పీ, ఈ కేసు దర్యాప్తు అధికారి అయిన దామోదర్ ఆధ్వర్యంలో సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ సాగనుంది.