ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. నవ హామీలు - వైఫల్యాలు పేరుతో ఆయన ఇప్పటి వరకు తొమ్మిది లేఖలు రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరో తొమ్మిది లేఖలు రాయనున్నట్లు రఘురామ చెప్పారు. తాజాగా సోమవారం ఆయన మరో లేఖ రాశారు. ఇందులో ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని ఆయన కోరారు. మెజార్టీ ఉన్నప్పుడు మండలి రద్దు చేస్తే చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారన్నారు.
సభలో మెజార్టీ ఉన్నప్పుడే మండలిని రద్దు చేస్తే మన చిత్తశుద్దిని ప్రజలు నమ్ముతారని.. మెజార్టీ లేనప్పుడు రద్దు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తుందని ఆయన పేర్కొన్నారు. మండలిలో మెజార్టీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో సీఎం జగన్ గౌరవం పెరుగుతుందని రఘురామ పేర్కొన్నారు. మండలి కొనసాగించడం వృథా అవుతుందని జగన్ చెప్పిన మాటలను నమ్మాలంటే.. తక్షణమే మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానన్నారు. జగన్ విలాసాలకు 26 కోట్లు ఖర్చు చేశారని గిట్టనివారు చెబుతున్నారని రఘురామ లేఖలో వంగ్యాస్త్రాలు సంధించారు.