భారతీయ ఒలింపియన్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచారు. ఈ వేడుకకు దాదాపు 140 మంది అతిథులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. ఉదయపూర్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీవీ సింధు వెంకట దత్తసాయి పెళ్లి జరిగింది.
ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవికి అతిథులను పడవల్లో తీసుకెళ్లారు. దీవిలోని రాఫెల్స్ రిసార్ట్‌లో దాదాపు 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ రిసార్ట్‌లో ఓ గదికి ఒక రోజు అద్దె రూ.1 లక్ష ఉంటుందని సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి వివాహ ఫొటోలను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుదల చేయలేదు. రేపు హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.
జనవరి నుండి పీవీ సింధు షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుందని, అందుకే పెళ్లికి ఇదే సరైన సమయమని సింధు తండ్రి పిటిఐకి చెప్పారు. దీంతో ఇరు కుటుంబాలు డిసెంబర్ 22న పెళ్లి వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. అంతకుముందు డిసెంబర్ 14న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.