రణరంగంలా మారిన పుంగనూరు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పుంగనూరు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 7:04 PM ISTరణరంగంలా మారిన పుంగనూరు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పుంగనూరు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చంద్రబాబు 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' కార్యక్రమం చేపట్టారు. పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబుని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేశారు. రహదారికి అడ్డుగా లారీని పెట్టి అడ్డుకునేందుకు చూశారు. అయితే.. చంద్రబాబుని అడ్డుకోవడం సరికాదని.. అడ్డుపెట్టిన లారీని తొలగించాలని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుని ఘర్షణలు చెలరేగాయి. రాళ్లు రవ్వుకునే వరకు వెళ్లారు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో జరిగిన ర్యాలీలో చంద్రబాబు చేసిన ప్రకటనే వాగ్వాదానికి కారణమని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. తంబళ్లేపల్లి ఎమ్మెల్యేపై రావణుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనకు ప్రతిఫలంగా చిత్తూరు జిల్లా అంగళ్లులో బహిరంగ సభకు చంద్రబాబు వెళుతుండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించి నిరసన తెలిపారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. పుంగనూరులో చంద్రబాబు ర్యాలీలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చంద్రబాబుకి అడ్డుచెప్పారు. బైపాస్ మీదుగా రోడ్‌షోను మళ్లించారు. కానీ, అప్పటికే చంద్రబాబు రాక కోసం ఎదురుచూస్తున్న టిడిపి కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. బస్సును, వజ్ర వాహనాన్ని తగులబెట్టారు. ఈ దాడిలో 20 మందికి పైగా బందోబస్త్ సిబ్బంది గాయపడ్డారు. జనాన్ని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినా టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి దిగారు. టెన్షన్ వాతావరణం మధ్య చంద్రబాబు పర్యటనకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా రెచ్చిపోయారు. టీడీపీ ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యర్తలపై దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలు జరిపిన రాళ్లదాడిలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను నిలువరించేందుకు ప్రయత్నాలు చేశారు. దాడికి దిగిన వైసీపీ శ్రేణులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఇక పుంగనూరులో రణరంగంపై చంద్రబాబు స్పందించారు. అధికారపార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే చోద్యం చూస్తూ ఉండిపోయారని ఆరోపణలు చేశారు. డీఎస్పీ తన యూనిఫామ్ తీసేయాలన్నారు. తాను బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా అని అన్నారు. పులివెందులకే వెళ్లాను.. చిత్తూరు రాకూడదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఘర్షణలు జరగడం వెనుక పోలీసుల వైఫల్యం ఉందని.. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంగళ్లు ఘటనపై విచారణ జరపాలని కోరారు. ఈ క్రమంలో రౌడీల్లా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులను ఏపీ నుంచి వెళ్లగొట్టాలని.. ప్రభుత్వం నుంచి గద్దె దించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.