జగన్ హయాంలో అవినీతిపై విచారణ చేపడుతాం
జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతామని మంత్రి నారాయణ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 2:23 AM GMTజగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్‌లో సాగునీటి సలహా బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు కావ్యా కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
8 లక్షల ఎకరాలకు సాగునీరు : నారాయణ
రబీ సీజన్‌లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోమశిల, కండలేరు జలాశయాల నుంచి 140 టీఎంసీల నీటిని ఇవ్వవచ్చని, మొత్తం 8 లక్షల ఎకరాలకు పైగా నీరందిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
జగన్ ప్రభుత్వంలో కాల్వల్లో సిల్టు తీయకుండా బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. కాల్వలను వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించారని. బుడమేరు వరదలకు కారణం ఆక్రమణలేనని స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరాలతో కాల్వలన్నీ చిత్రీకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. సీఎం ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని ఆదేశాలిచ్చారన్నారు.