ఏపీలో రెండ్రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం.. షెడ్యూల్ ఇదే
దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 4:14 PM ISTఏపీలో రెండ్రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం.. షెడ్యూల్ ఇదే
దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. రాజకీయ పార్టీల నాయకులు, టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలనీ.. ఆ తర్వాత స్థానికంగా అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీ ప్రత్యర్థుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు జాతీయ పార్టీల అగ్ర నేతలు రాష్ట్రాల్లో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. రెండ్రోజుల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారంలో పాల్గొననున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ఏపీలో కూటమికి అనుకూలంగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా రోడ్‌షోలతో పాటు పలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
ఈ నెల 7, 8 వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. ఏడో తేదీన వేమగిరిలో రాజమహేంద్రవరం లోక్‌సభ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం అనకాపల్లిలోని రాజుపాలెం సభలో కూడా మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత మే 8వ తేదీన పీలేరు బహిరంగ సభలో పాల్గొనున్నారు. రాత్రి విజయవాడలోని ఇందిరా స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జరిగే రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ వెల్లడించింది.