సామాన్యుడికి షాక్‌.. విజయ పాల ధ‌ర పెంపు.. లీట‌ర్‌కు ఎంతంటే..?

విజ‌య పాల ధ‌ర‌ను లీట‌ర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్న‌ట్లు కృష్ణామిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) తెలిపింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2023 8:30 AM IST
సామాన్యుడికి షాక్‌.. విజయ పాల ధ‌ర పెంపు.. లీట‌ర్‌కు ఎంతంటే..?

మూలిగే న‌క్క‌పై తాటి పండు ప‌డ్డ‌ట్లు అన్న‌చందంగా మారింది సామాన్యుడి ప‌రిస్థితి. ఓ వైపు ప‌ప్పులు, ఉప్పు, నూనె ధ‌ర‌ల‌తో పాటు పెట్రోల్. డీజిల్ ధ‌ర‌లు ఇప్ప‌టికే పెరుగ‌గా తాజాగా పాల ధ‌ర‌లు కూడా పెరిగాయి. విజ‌య పాల ధ‌ర‌ను లీట‌ర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్న‌ట్లు కృష్ణామిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) తెలిపింది. రైతుల పాల సేక‌ర‌ణ ధ‌ర‌లు, నిర్వ‌హ‌ణ, ర‌వాణా ఖ‌ర్చులు పెర‌గడంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు యూనియ‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కొల్లి ఈశ్వ‌ర‌బాబు తెలిపారు.

విజయ లోఫాట్‌ (డీటీఎం) లీటర్‌ పాల ధర రూ.52 ఉండగా.. దాన్ని రూ.54కు పెంచారు. విజయ ఎకానమీ (టీఎం) లీటర్‌ రూ.56 ఉండగా.. రూ.58కు, విజయ ప్రీమియం (స్టాండర్డ్‌) లీటర్‌ రూ.60 ఉండగా.. రూ.62కు, విజయ స్పెషల్‌ (ఫుల్‌క్రీమ్‌) పాలు లీటర్‌ ధర రూ.70 నుంచి రూ.72కు, విజయ గోల్డ్‌ పాలు లీటర్‌ రూ.72 ఉండగా.. రూ.74కు, విజయ టీ-మేట్‌ లీటర్‌ రూ.66 ఉండగా.. రూ.68కి పెరిగింది. పెరిగిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

అయితే.. చిన్న పాల ప్యాకెట్లు, పెరుగు, పాల ప‌దార్థాల విక్ర‌య ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేద‌ని చెప్పారు. నెలవారీ పాలకార్డు కొన్న వారికి మార్చి 9 తేదీ వరకు పాత ధరలే వర్తిస్తాయ‌ని అన్నారు.

Next Story