అమాంతం పెరిగిన చికెన్ ధర.. వామ్మో అంటున్న జనం
చికెన్ ధర ఆకాశనంటుతోంది. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధర భారీగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో కిలో
By అంజి Published on 15 Jun 2023 8:32 AM ISTఅమాంతం పెరిగిన చికెన్ ధర.. వామ్మో అంటున్న జనం
చికెన్ ధర ఆకాశనంటుతోంది. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధర భారీగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో కిలో చికెన్ రూ.320 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. ఇక అక్కడక్కడ స్వల్ప మార్పులు ఉంటున్నాయి. లైవ్ చికెన్ కిలో రూ.170 నుంచి రూ.200 ఉండగా, స్కిన్ చికెన్ రూ.280 నుంచి రూ.300 మధ్య ఉంది. స్కిన్ లెస్ చికెన్ 320-350 వరకూ పలుకుతోంది. అంటే ఒక్క నెలలోనే చికెన్ ధర దాదాపు వంద రూపాయలు పెరిగింది. ఎండల ప్రభావం తీవ్రంగా ఉండటంతో రా మెటీరియల్ ఖర్చులు పెరగడం.. చికెన్ ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. సమ్మర్‌లో కోళ్లు ఆహారం తీసుకోవు. అయితే నీరు ఎక్కువగా తాగుతుంటాయి. దీని కారణంగా వాటి పెరుగుదల రేటు తగ్గిపోతుంది.
అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ 40 రోజుల్లో 2.5 కేజీలు పెరిగే కోడి, వేసవిలో మాత్రం 40 రోజుల్లో 2 కేజీల బరువు పెరగడం కష్టం. కోవిడ్ వేవ్స్ తరువాత ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న వేసవి కాలం ఇదే. ఈసారి వడగాల్పుల తీవ్రత గత రెండేళ్ల కంటే ఎక్కువ ఉంది. దీని కారణంగా కొన్ని కోళ్లు ఫామ్‌లో చనిపోతాయి. ఇక రవాణాలో, లోడింగ్, అన్ లోడింగ్ దగ్గర కూడా మరికొన్ని కోళ్లు అత్యధిక వేడి కారణంతో చనిపోతాయి. చికెన్ సెంటర్లలో కోయడానికి సిద్ధంగా ఉన్న కోళ్లు కూడా వేడికి తట్టుకోలేక మరణిస్తున్నాయి. వీటి కారణంగా కోడి మాంసం ఉత్పత్తి బాగా తగ్గింది. ఉత్పత్తి తగ్గడం ధరల పెరుగుదలకు అది పెద్ద కారణంగా మారింది. పైగా ఈసారి వేసవి నిడివి ఎక్కువ కాలం ఉంది.
ఈసారి ఇలా ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ చేసే కంపెనీలు కూడా కోళ్లు పెంచే శాతం తగ్గించాయి. అలాగే కోళ్ల మేతలో ప్రధానంగా వాడే మొక్కజొన్న ధరలు బాగా పెరిగాయి. మందులు, వ్యాక్సీన్ల ధరలూ పెరిగాయి. దానికి తోడు కరోనా తరువాత రవాణా చార్జీలు బాగా పెరిగాయి. ఇవన్నీ కలసి కోడి మాంసం ఉత్పత్తి ధరను పెంచేశాయి. తెలంగాణ, మహారాష్ట్రలతో పాటూ చాలా చోట్ల శ్రావణ మాసంలో మాంసం తినరు. ఆ భయానికి కూడా కోళ్ల పెంపకం సంఖ్య తగ్గించారు రైతులు. ఈ అన్ని కారణాలు కలపి బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి సాధారణం కంటే 30-40 శాతం తగ్గింది. దీంతో అమాంతం రేట్లు పెరిగిపోయాయి.