ఉద్యోగ సంఘాల‌తో సీఎం జ‌గ‌న్ భేటీ.. ఒక్క‌టిగా క‌లిసి ముందుకు సాగుదాం

PRC Steering Committee meets CM Jagan Today.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పీఆర్‌సీ వివాదం ముగిసింది. ఉద్యోగుల సంఘాలతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2022 1:31 PM IST
ఉద్యోగ సంఘాల‌తో సీఎం జ‌గ‌న్ భేటీ.. ఒక్క‌టిగా క‌లిసి ముందుకు సాగుదాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పీఆర్‌సీ వివాదం ముగిసింది. ఉద్యోగుల సంఘాలతో మంత్రుల క‌మిటీ జ‌రిపిన‌ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో స‌మ్మె చేయాల‌న్న నిర్ణ‌యాన్ని ఉద్యోగ సంఘాలు ఉప‌సంహ‌రించుకున్నాయి. ప్ర‌భుత్వం త‌మ కోరిక‌ల‌ను మ‌న్నించ‌డంతో స‌మ్మెలోకి వెళ్ల‌డం లేద‌ని నేతలు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం సీఎం జ‌గ‌న్ ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాయి ఉద్యోగ సంఘాలు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామే అంతా చేశామ‌న్నారు. ఇక రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుందన్నారు. రాజకీయాలకు తావు ఉండకూడదని తెలిపారు.

ఇక ఉద్యోగుల‌కు ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్‌ కమిటీ కూడా ఉందని.. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చున‌ని పేర్కొన్నారు. మంత్రుల కమిటీ కూడా కొనసాగుతుందన్నారు. ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చున‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ప్రభుత్వం అంటే ఉద్యోగులదని.. అంత దూరం పోవాల్సిన అవ‌స‌రం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చన్నారు. ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌న్నారు.

మంత్రుల కమిటీ నిన్న త‌న‌తో టచ్‌లోనే ఉందన్నారు. త‌న‌ ఆమోదంతోనే వీటన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగిందన్నారు. ఇక ఐఆర్‌ ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐఆర్‌ను. సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400 భారం, హెచ్‌ఆర్‌ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోందన్నారు. అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్‌ వ్యయం రూపేణా హెచ్‌ఆర్‌ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోంది. మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోందన్నారు.

మీకు తెలిసి ఉండాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ వివ‌రాలన్నింటిని చెబుతున్న‌ట్లు సీఎం చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా మీరు ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు అంగీక‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. మ‌నం ఒక్క‌టిగా క‌లిసి ముందుకు సాగుదాం అని చెప్పారు. ఈ పరిస్థితులు ఈమాదిరిగా ఉండకపోయి ఉంటే మీరందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని.. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తా అన్నారు. 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం అన్నారు. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం సీఎం జ‌గ‌న్ అన్నారు.

Next Story