పవన్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థపూరితం: పోతిన మహేశ్
పార్టీకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోతిన మహేశ్ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 8 April 2024 3:15 PM ISTపవన్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థపూరితం: పోతిన మహేశ్
జనసేన పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత పోతిన మహేశ్. జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోతిన మహేశ్ పోటీ చేశారు. కానీ.. గెలుపొందలేదు. ఈసారి కూడా జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు కానీ.. అది జరగలేదు. జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో టికెట్ కేటాయింపుల్లో మార్పులు జరిగాయి. విజయవాడ పశ్చిమ టికెట్‌ను బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే.. ఇదే స్థానం నుంచి టికెట్ ఆశించిన పోతిన మహేశ్ అది జరగకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే పోతిన మహేశ్ జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోతిన మహేశ్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిందని అన్నారు. పవన్ ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటూ విమర్శలు చేశారు. పార్టీ నిర్మాణం, క్యాడర్‌పై ఏనాడు దృష్టి సారించలేదని విమర్శించారు. పవన్ ది అంతా నటనే అనీ.. పవన్ సిద్ధాంతాలు అన్ని స్వార్ధపూరితమని పోతిన మహేశ్ అన్నారు. పవన్ గురించి తెలిసే ఆయన్ని ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేటాయించిన సీట్లతో పార్టీకి ఏం భవిష్యత్ ఉంటుందని ప్రశ్నించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామనీ.. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని పోతిన మహేశ్ ఆవేదన చెందారు.
జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేదని పోతిన మహేశ్ ప్రశ్నించారు. టీడీపీ వారికే ఎందుకు సీట్లు ఇచ్చారన్నారు. కాపు సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారని ఆరోపించారు. కాపు యువతను మోసం చేయొద్దని పవన్ కల్యాణ్‌కు పోతిన మహేశ్ హితవు పలికారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతుందని అన్నారు. గెలిచి పశ్చిమ నియోజకవర్గం సీటును ఎందుకు త్యాగం చేశారో అర్థం కావట్లేదన్నారు. త్యాగాలకు బీసీలు కావాలా? అని పోతిన మహేశ్ ప్రశ్నించారు.