ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగింపు
ఏపీలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 1:38 AM GMTఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగింపు
ఏపీలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి సెలవులను మరో మూడ్రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
వాస్తవానికి ఏపీలో స్కూళ్లక సంక్రాంతి సెలవులు మొదట జనవరి 18 వరకు అని ప్రకటించారు. తద్వారా జనవరి 19 నుంచే స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉండగా.. ఆ సెలవులను తాజాగా పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి సెలవులను మరో మూడ్రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటనలో తెలిపింది. జనవరి 22న రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేశ్ కుమార్ తెలిపారు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
జనవరి 22న అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంతో.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు జనవరి 22న స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా జనవరి 22న స్కూళ్లకు సెలవు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అలా జనవరి 22న సెలవు ప్రకటించిన 23వ తేదీని తిరిగి స్కూళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సందర్భంగా వరుసగా 13రోజల పాటు సెలవులు వచ్చినట్లు అవుతుంది. ఇక తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు ఇచ్చిన విషయం తెలిసిందే.