పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు..అందుకే నోటీసులు: కృష్ణా జిల్లా ఎస్పీ
పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అన్నారు.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 9:18 AM GMTపవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు..అందుకే నోటీసులు: కృష్ణా జిల్లా ఎస్పీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్‌చేశారంటూ పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు.
పవన్ కళ్యాణ్‌కు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అన్నారు. అందుకే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా వారాహి యాత్రపై రాళ్ల దాడి జరుగుతుందని సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆ విషయం తమకు తెలియపర్చాలని ఎస్పీ అన్నారు. కాగా.. తాము పంపిన నోటీసులకు పవన్ కళ్యాణ్ ఏ విధంగానూ స్పందించలేదని అన్నారు. రిప్లై రాలేదంటే ఆయన వ్యాఖ్యలు నిరాధారమైనవని అనుకోవాలా..? అని అన్నారు. ఎలాంటి సమాచారంతో పవన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ప్రశ్నించారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని అన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ. బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసనానాలు ఉంటాయని చెప్పారు. రెచ్చొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలని సూచించారు. పోలీసులకు ఉండాల్సిన సమాచార వ్యవస్థ తమకు ఉందని.. పవన్ కళ్యాణ్ కంటే నిఘా వ్యవస్థ తమకు బలంగా ఉందని చెప్పారు. అసాంఘిక శక్తులు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా.
కాగా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. పెడనలో జరుగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోందంటూ పవన్ ఆరోపించారు. మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సంచలన ఆరోపణలు చేశారు. పెడన వారాహి యాత్రలో రాళ్ల దాడులు చేసి, రక్తపాతం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.