టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి యువగళం పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. నారా లోకేశ్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతోంది. లోకేశ్ యువగళం యాత్రపై జిల్లా టీడీపీ నేతలు ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. అనుమతిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. పాదయాత్రను ఎందుకు రిజెక్ట్ చేస్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు. దీనికి సంబంధించి కాసేపట్లో చిత్తూరు జిల్లా ఎస్పీ నుంచి అధికారిక ప్రకటన రానుంది.
ఈ విషయమై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్రకు సీఎం అనుమతి అవసరంలేదని.. గతంలో జగన్ ఏమైనా అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎంత అసాధ్యమో, లోకేశ్ పాదయాత్రను అపడం కూడా అంతే అసాధ్యం అని బుద్ధా వెంకన్న అన్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని లోకేశ్ పాదయాత్రను ఆపడం ఎవరి వల్లా కాదని అన్నారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం అని.. పాదయాత్ర నిర్వహిస్తున్నామని పోలీసు శాఖకు సమాచారం ఇచ్చామని, ఇక ఎవరి అనుమతులు తమకు అవసరం లేదని అన్నారు.