GOOD NEWS: ఇకపై కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.2.39 లక్షలు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By - అంజి |
GOOD NEWS: ఇకపై కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.2.39 లక్షలు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేద కుటుంబాల కోసం నిర్మించే ఒక్కో ఇంటి యూనిట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న రూ.1.20 లక్షల వ్యయాన్ని ఇప్పుడు రూ.2.39 లక్షలకు పెంచడం ద్వారా లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గనుంది. ఐదేళ్లలో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామన్న కూటమి ప్రభుత్వ హామీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం అమలుకు సంబంధించి నిధుల సమీకరణను ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం (రూ.72,000) కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం (రూ.48,000) ఉంటుంది. ఈ రెండు కలిపి రూ.1.20 లక్షలు నేరుగా అందుతాయి. వీటికి అదనంగా ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద 90 పని దినాలకు గాను రూ.27,000, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12,000 లభిస్తాయి. వీటన్నింటితో పాటు స్వయం సహాయక సంఘాల (SHG) రుణంపై రూ.80,000 వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం కల్పించనుంది.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. పెంచిన ఈ యూనిట్ ధర తక్షణమే అమల్లోకి రానుంది. ప్రభుత్వం అందించే ఈ మొత్తం రూ.2.39 లక్షలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయబడతాయి. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా పేదలకు సొంత ఇంటి కల నెరవేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.