ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. 15 రోజుల వ్యవధిలో సుమారు వెయ్యి పందులు మృతి చెందాయి.
పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవాలయం దిగువ ప్రాంతంలో కొందరు పందుల్ని పెంచుతున్నారు. సమీపంలోని మునేరు పరిసరాల్లో అవి మేతకు వేసేందుకు వెలుతుంటాయి. కొద్ది రోజులుగా అటు వైపు వెళ్లిన పందులు తిరిగి రావడం లేదు. దీంతో వాటి పెంపకం దారులు వాటి కోసం వెతుకగా ఎక్కడపడితే అక్కడ అవి చనిపోయి కనిపిస్తున్నాయి.
కొన్ని వందల కళేబరాల్ని పూడ్చిపెట్టగా, మరికొన్ని కుళ్లిన స్థితిలో కనిపిస్తున్నాయి. పందులు చనిపోతుండడంతో ఇప్పటికే లక్షల్లో నష్టపోయినట్లు వాటి పెంపకం దారులు తెలిపారు. మూడు దశాబ్దాలుగా వాటిని పెంచుతున్నామని ఎప్పుడూ కూడా ఇలా జరగలేదని అంటున్నారు.
చనిపోయిన పందుల నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రయత్నించినా అవి కుళ్లిపోవడంతో సాధ్యం కాలేదని పశువైద్యులు తెలిపారు. వాటికి పెట్టే ఆహారం, నీళ్లు మార్చాలని పెంపకందారులకు సూచించారు.