ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సెక్షన్ 91 కింద రవీంద్రకు నోటీసులు ఇచ్చారు. మంత్రిపై హత్యాయత్నం ఘటనపై కొల్లు రవీంద్ర ఇటీవల చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి హత్యాయత్నం కేసులో నిందితుడి సోదరి ఉమాదేవితో పాటు పలువురు టీడీపీ నాయకులను రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు.
మంత్రి పేర్నినానిపై దాడి చేసిన నిందితుడిని కోర్టు అనుమతితో చిలకలపూడి పీఎస్‌కు తరలించారు. నిందితుడు నాగేశ్వేరరవు మచిలీపట్నం సబ్‌జైలులో కస్టడీలో ఉన్నాడు. అయితే.. విచారణ నేపథ్యంలో చిలకలపూడి సీఐ వెంటక నారాయణ కోర్టు అనుమతితో భారీ బందోబస్తు మధ్య చిలకలపూడి పీఎస్‌కు తరలించారు. రెండు రోజుల పాటు నాగేశ్వరరావును విచారించనున్న పోలీసులు అతని మొబైల్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు.