పంజా విసురుతోన్న చలి.. వణకుతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు.
By అంజి Published on 15 Dec 2024 2:02 AM GMTపంజా విసురుతోన్న చలి.. వణకుతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు. దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
ఏపీలోని అల్లూరి జిల్లా కుంతలంలో 8.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీలో లోపే ఉష్ణగ్రతలు ఉంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర, ఈశాన్య భారతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇవాళ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
నేడు అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి తమిళనాడు తీరం దిశగా రానుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 17, 18 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.