రోడ్ల ఖర్చుపై పవన్ ట్వీట్..చంద్రబాబును మించిపోయాడని వైసీపీ సెటైర్
2024 ఎన్నికల్లో విక్టరీ సాధించి పవర్‌లోకి వచ్చిన అనంతరం తాము ఏం చేశామనే వివరాలను పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
By Knakam Karthik Published on 12 Jan 2025 5:23 PM ISTరోడ్ల ఖర్చుపై పవన్ ట్వీట్..చంద్రబాబును మించిపోయాడని వైసీపీ సెటైర్
ఛాన్స్ దొరికిన ప్రతి సారి ఏపీలో గత వైసీపీ సర్కార్ విధానాలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివిధ సభల్లో ఎండగడుతున్నారు. అయితే మరోసారి వైసీపీ పైనా, గత ప్రభుత్వ తీరుపైనా కూడా విమర్శలు చేశారు. అయితే ఈసారి నేరుగా కాకుండా పరోక్షంగా చెప్పాలనుకుంటున్నది లెక్కలతో సహా ట్వీట్ చేశారు. 2024 ఎన్నికల్లో విక్టరీ సాధించి పవర్‌లోకి వచ్చిన అనంతరం తాము ఏం చేశామనే వివరాలను పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ ఆరు నెలల టైమ్‌లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా తన పని తీరుకు సంబంధించిన వివరాలను ఆయన పంచుకున్నారు. అయితే వైసీపీ హయాంలో ఏం చేశారు, కూటమి ప్రభుత్వ పాలనలో ఏం చేశారనే దానిని పోలుస్తూ ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ పాలనలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ఈ ఆరు నెలల కాలంలో సాధించిన ఘనతలు ఇవి అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో 1800 కిలో మీటర్లు సీసీ రోడ్లు నిర్మిస్తే.. టీడీపీ కూటమి సర్కారు ఆరు నెలల్లో 3,750 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అలాగే వైసీపీ ఐదేళ్ల పాలనలో 268 మినీ గోకులాలు ప్రారంభిస్తే, టీడీపీ కూటమి సర్కార్ ఆరు నెలల్లోనే 22500 మినీ గోకులాలు ఏర్పాటు చేసిందని ట్వీట్ చేశారు. పీవీటీజీ ఆవాసాల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 91 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, తాము ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు చేశామని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.
అయితే పవన్‌కల్యాణ్ ట్వీట్‌పై స్పందించిన వైసీపీ విమర్శలు గుప్పించింది. గోరంతను కొండంతగా చేసి చూపించడంలో చంద్రబాబును, పవన్‌కల్యాణ్ మించిపోయారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేయడంలో పవన్ కల్యాణ్ తన గురువు చంద్రబాబును మించిన శిష్యుడయ్యాడని వైసీసీ సెటైర్లు వేసింది.