ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

By Srikanth Gundamalla  Published on  12 Jun 2024 12:16 PM GMT
pawan kalyan, deputy cm andhra pradesh, amit shah, chiranjeevi,

 ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌ 

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసిన తర్వాత.. మంత్రి పవన్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా.. పవన్ కల్యాణ్‌కు ఏ పదవి ఇస్తారనే ఉత్కంఠ కొనసాగిన నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం హోదా ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలానే ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు అని తెలిపారు. ఎక్స్ లో పెట్టిన పోస్టు వైరల్ అవుతున్నాయి.

కాగా.. చంద్రబాబు సీఎంగా.. జనసేనాని పవన్ కల్యాణ్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎవరికీ ఇంకా శాఖలు కేటాయించలేదు. కానీ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు అంటూ అమిత్‌షా ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. పవన్ కల్యాణ్‌ను పెద్దలే డిప్యూటీ సీఎం అని తేల్చడంతో ఇది ఖరారు అయ్యిందని పలువురు అంటున్నారు.

కాగా.. అమిత్‌షా ఈ విధంగా పోస్టు పెట్టారు.. ”ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు అమిత్ షా.

అటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే విధంగా ఎక్స్ లో ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎంగా చిరంజీవి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు అని ఆయన పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. అటు అమిత్ షా, ఇటు చిరంజీవి.. పవన్ కల్యాణ్ ను ఉప ముఖ్యమంత్రిగా పేర్కొనడం రాజకీయవర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్ అయ్యింది.

”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.. ఆశిస్తున్నాను..” అని ట్వీట్ చేశారు చిరంజీవి.

Next Story