సీఐ అంజూయాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్
సీఐ అంజూ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి పవన్ ఫిర్యాదు చేశారు.
By Srikanth Gundamalla Published on 17 July 2023 1:29 PM ISTసీఐ అంజూయాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్
ఇటీవల శ్రీకాళహస్తిలో ఆందోళనలకు దిగిన జనసేన నాయకులపై మహిళా సీఐ అంజూయాదవ్ చేయి చేసుకున్నారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయబోయినందుకు జనసేన కార్యకర్త చెంపై దెబ్బలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే.. సీఐ తీరుని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు, నాయకులు ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు. సీఐ అంజూ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారంటూ ఆమెపై తీవ్ర విమర్శలు చేసిన విషయం కూడా తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లారు. ఉదయం రేణిగుంట ఎయిర్‌పోర్టులో పవన్‌కు ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత కార్యకర్తలు, అభిమానులతో 15 కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్ని సాయితో పాటు ఆరుగురు నాయకులతో కలిసి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని కలిశారు. సీఐ అంజూ యాదవ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.
నిరసన కారులను అదుపు చేసే క్రమంలో సీఐ అంజూ యాదవ్ సాయిపై చేయిసుకున్నారు. ఇతర కార్యకర్తలు, అభిమానులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన సైనికులకు వెన్నంటే ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఐపై ఎస్పీ గారికి ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు సీఐ అంజూ యాదవ్‌కు ఛార్జ్ మెమో జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ నిర్వహించి నివేదిక అందించారని ఈ సందర్భంగా పోలీసులు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు.