ఎదురింటి వారితో గొడవ.. రోడ్డు మధ్యలో గోడ కట్టిన వ్యక్తి
సాధారణంగా పక్కపక్కన, ఎదురింట్లో ఉండేవారు ఎప్పుడూ సహాయ, సహకారాలు అందించుకుంటుంటారు.
By Srikanth Gundamalla Published on 2 Dec 2023 10:17 AM GMTఎదురింటి వారితో గొడవ.. రోడ్డు మధ్యలో గోడ కట్టిన వ్యక్తి
సాధారణంగా పక్కపక్కన, ఎదురింట్లో ఉండేవారు ఎప్పుడూ సహాయ, సహకారాలు అందించుకుంటుంటారు. కొందరు మాత్రం వారితో వీరికి.. వీరితో వారికి పడక గొడవలు జరుగుతుంటాయి. స్థలం విషయంలో.. ఇతరత్రా అంశాల్లో ఘర్షణలు జరుగుతుంటాయి. సరిగ్గా పల్నాడు జిల్లాలో కూడా ఇలానే ఎదురెదురుగా ఉంటోన్న ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. ప్రతి విషయంలో ఇద్దరూ తిట్టిపోసుకునేవారు. తాజాగా వారిలో ఒకరు ఏకంగా ఇంటికి ఎదురుగా నడిరోడ్డుపై గోడ కట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పల్నాడు జిల్లా శాల్యాపురం మండలం కారుమంచిలో లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే.. వీరి గృహాలు రెండు ఎదురెదురుగా ఉంటాయి. నిత్యం వీరి కుటుంబాల మధ్య చిన్నచిన్న విషయాలకు గొడవలు జరుగుతూ ఉండేవి. వీరి ఇళ్ల మధ్యలో సీసీ రోడ్డు ఉంది. అయితే.. లక్ష్మీనారాయణ రోడ్డుమీదకు వచ్చేలా గతంలో మెట్లు కట్టాడని చంద్రశేఖర్ అభ్యంతరం తెలిపాడు. ఆ మెట్ల వివాదంలో ఇద్దరూ గొడవ పడ్డారు. చివరకు ఆ విషయం గ్రామంలో ఉంటోన్న పెద్దల వరకూ పోయింది. పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు.
అందరూ నచ్చజెప్పడంతో ఇద్దరూ రాజీకి వచ్చారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ ఇటీవల తన ఇంటి ఎదుట మురుగు కాలువపై మెట్లు కట్టాడు. దీనికి నిరసనగా లక్ష్మీనారాయణ ఏకంగా ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డు మధ్యలో సిమెంట్ ఇటుకలతో గోడ నిర్మించాడు. కావాలనే చేస్తున్నాడంటూ చంద్రశేఖర్ ఆరోపిస్తున్నాడు. వీరి ఇద్దరి మధ్య గొడవలు గ్రామంలో నిత్యం జరుగుతున్నాయి. పైగా ఇప్పుడు లక్ష్మీనారాయణ ఏకంగా రోడ్డు మధ్యలో గోడ నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య గొడవకారణంగా ఇలా వ్యవహరిస్తారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.