పల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ, ముగ్గురు మృతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 10:37 AM GMTపల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ, ముగ్గురు మృతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మందికి గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతల ఆటోలో బయల్దేరారు. అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట వైపు వెళ్తుంది. ఈ క్రమంలో లింగంగుంట్ల బస్‌స్టాప్ వద్ద ఆటో చిలకలూరిపేట రోడ్డులోకి వచ్చింది. రెండు ఎదురెదురు కావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. దాంతో.. ఆటోను తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ.. అది సాధ్యం కాలేదు. బస్సు బోల్తా పడింది.. బస్సు కిందే ఆటో పడిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యింది.
ఈ ప్రమాదంలో ఆటోలోని కూలీల్లో హనుమాయమ్మ అనే మహిళ సంఘటనాస్థలి వద్దే చనిపోయింది. ఇక డ్రైవర్ సహా గాయాలపాలైన 14 మంది కూలీలను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివపార్వతి ప్రాణాలు విడించింది. ఇక పరిస్థితి విషమంగా ఉన్న షేక్ హజరత్ వలీని గుంటూరుకు తీసుకెళ్లారు. కానీ.. అక్కడికి చేరుకుని చికిత్స అందించే లోపే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఇక మరో 11 మంది కూలీలు చిలకలూరిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.