ఏపీలో 'ఆపరేషన్ చైతన్యం' సక్సెస్: 94 ఎకరాల గంజాయి తోటలను పీకివేసిన ఈగిల్ టీమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ చైతన్యం’ ద్వారా భారీ విజయాన్ని సాధించింది.
By - అంజి |
ఏపీలో 'ఆపరేషన్ చైతన్యం' సక్సెస్: 94 ఎకరాల గంజాయి తోటలను పీకివేసిన ఈగిల్ టీమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ చైతన్యం’ ద్వారా భారీ విజయాన్ని సాధించింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) బృందం అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 94.77 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేసింది. శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ల నిఘా సాయంతో సుమారు 31,185 గంజాయి మొక్కలను పీకి వేశారు. ఈ విజయాలకు సంబంధించిన 'ఈగిల్ వార్షిక నివేదిక – 2025'ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో విడుదల చేశారు.
వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ సాయంతో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను దెబ్బతీయడంలో ఈగిల్ బృందం అద్భుతంగా పనిచేస్తోందని కొనియాడారు. కేవలం అణచివేత మాత్రమే కాకుండా, గంజాయి సాగు చేసే గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపిస్తూ సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.
ఆపరేషన్ సేఫ్ క్యాంపస్: విద్యార్థుల రక్షణే లక్ష్యం
విద్యా సంస్థల సమీపంలో డ్రగ్స్ అమ్మకాలను అరికట్టడానికి 'ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్' పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జూలై 2025 నుండి జనవరి 2026 మధ్య కాలంలో 45,200 దుకాణాలను తనిఖీ చేశారు. 47,441 కేసులు నమోదు చేసి, సుమారు రూ. 72.92 లక్షల జరిమానా విధించారు. విద్యా సంస్థల్లో 40,000 కు పైగా ఈగిల్ క్లబ్‌లను ఏర్పాటు చేసి, 20 లక్షల మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు.
2025 ఎన్‌ఫోర్స్‌మెంట్ ముఖ్యాంశాలు:
నమోదైన కేసులు: 1,836 (NDPS చట్టం కింద).
సీజ్ చేసిన గంజాయి: 46,011 కిలోలు.
అరెస్టులు: 4,760 మంది నిందితులు, 770 వాహనాలు స్వాధీనం
ఆస్తుల జప్తు: డ్రగ్స్ మాఫియాకు చెందిన రూ. 9.11 కోట్ల ఆస్తుల ఫ్రీజ్/జప్తు.
దహనం: శాస్త్రీయ పద్ధతిలో 1,12,406 కిలోల గంజాయిని తగులబెట్టారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల పట్ల 'జీరో టాలరెన్స్' (సహించేది లేదు) విధానాన్ని అనుసరిస్తున్నామని, యువత భవిష్యత్తును కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.